వర్సిటీల్లో ‘మ్యాన్‌పవర్ ఆడిట్’.. 30 రోజుల్లో అక్రమ నియామకాలపై వేటు: మంత్రి లోకేశ్‌

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని (ఏయూ) పూర్తిగా పార్టీ కార్యాలయంగా మార్చేశారని రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో గత ఐదేళ్లలో జరిగిన అక్రమ నియామకాలపై ప్రత్యేకంగా 'మ్యాన్‌పవర్ ఆడిట్' నిర్వహిస్తామని, 30 రోజుల్లో నివేదిక తెప్పించుకుని అనర్హులపై వేటు వేస్తామని ఆయన స్పష్టం చేశారు.

ఇవాళ‌ శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో విశాఖపట్నం ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, గణబాబు, వంశీకృష్ణ శ్రీనివాస్.. ఏయూలో గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలపై చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే, కాంట్రాక్ట్, రోజువారీ వేతన సిబ్బంది సర్వీసులను క్రమబద్ధీకరించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై మంత్రి లోకేశ్ సమాధానమిస్తూ.. గత ప్రభుత్వంలో వర్సిటీల్లో వైసీపీ కార్యకర్తలను విచ్చలవిడిగా నియమించుకున్నారని, ఈ అక్రమాలపైనే మ్యాన్‌పవర్ ఆడిట్ చేపడుతున్నామని తెలిపారు. ఈ ఆడిట్ పూర్తయ్యాక, ఆర్థిక శాఖతో చర్చించి ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌పై తగిన నిర్ణయం తీసుకుంటామన్నారు.

అదేవిధంగా, ఏయూ మాజీ వీసీ ప్రసాదరెడ్డి అవకతవకలపై విజిలెన్స్ విచారణ జరుగుతోందని, మరో 45 రోజుల్లో ఆ నివేదిక ప్రభుత్వానికి అందుతుందని మంత్రి వెల్లడించారు. ఆ రిపోర్టు ఆధారంగా బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

గత ప్రభుత్వ నిర్వాకం వల్లే ఏయూ కీర్తి ప్రతిష్ఠ‌లు మసకబారాయని లోకేశ్‌ విమర్శించారు. 2019లో ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్‌లో 29వ స్థానంలో ఉన్న ఏయూ, 2023 నాటికి 76వ ర్యాంకుకు పడిపోయిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటికే 41వ ర్యాంకుకు మెరుగుపడిందని, త్వరలోనే వర్సిటీని టాప్-10లోకి తీసుకురావడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.

ఆంధ్రా యూనివర్సిటీ వందేళ్ల ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని సభ్యులు కోరగా, దానిపై మంత్రి సానుకూలంగా స్పందించారు. రేపటి విశాఖ పర్యటనలో వీసీతో సమావేశమై శతాబ్ది ఉత్సవాల నిర్వహణపై సమీక్షిస్తానని, సభ్యుల సలహాలు కూడా తీసుకుని వేడుకలను ఘనంగా నిర్వహిస్తామని మంత్రి లోకేశ్‌ హామీ ఇచ్చారు.

Nara Lokesh
Andhra University
AU
Manpower Audit
Illegal Appointments
YSRCP
Visakhapatnam
NIRF Rankings
AP Universities
Prasad Reddy

More Telugu News